తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే సీతక్క - షాద్​నగర్​లో అంబులెన్స్​ సేవలను ప్రారంభించిన సీతక్క

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

Mla seethakka
Mla seethakka

By

Published : May 18, 2021, 2:31 PM IST

పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఎన్ఎస్​యూఐ షాద్​నగర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

కరోనాపై ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని సీతక్క ధ్వజమెత్తారు. వైరస్​ బారినపడి సామాన్య ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి, ఆక్సిజన్​, ఔషధాల కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలకు కరోనా వస్తే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారని, పేదోడికి మాత్రం ప్రభుత్వ దవాఖానాలే దిక్కయ్యాయని ఆక్షేపించారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండాలి..

కరోనా బాధితులకు సేవలందించడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ శక్తిమేర కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. షాద్​నగర్ పట్టణంలో కరోనా బాధితులకు, నిరాశ్రయులకు భోజనం, అంబులెన్స్ సేవలు అందించడానికి కృషి చేస్తున్న ఎన్ఎస్​యూఐ జాతీయ కన్వీనర్ జె.ఆర్. దినేశ్​ సాగర్​ను సీతక్క అభినందించారు. ఈ సందర్భంగా ఎన్​ఎస్​యూఐ చేపట్టిన ఉచిత భోజన ఏర్పాట్లను పరిశీలించి.. స్వయంగా వంటలు చేశారు.

ఇదీ చూడండి: అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల

ABOUT THE AUTHOR

...view details