రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం కింద చేపట్టిన పనులన్నింటినీ.. ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై రెండు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించేందుకై ప్రవేశపెట్టిన ఈ పథకంలో జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి నీరందించాలని ఆదేశించారు.
రూ. 436 కోట్ల వ్యయం..
రంగారెడ్డి జిల్లాలో రూ. 436 కోట్ల 35 లక్షల వ్యయంతో మొత్తం 1,062 ఆవాసాలకు 2876 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైప్ లైన్ వేసి ఇంటింటికీ రక్షిత నీరందించే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. జిల్లాలో 656 గ్రామాలకు 90 శాతానికి పైగా నీరందుతున్నాయని, ఈ గ్రామాలను గ్రీన్ గ్రామాలుగా, 90 శాతం కన్నా తక్కువగా గృహాలకు తక్కువగా నీరందుతున్న 386 గ్రామాలను ఆరెంజ్ గ్రామాలుగా, అసలు నీరందని 24 గ్రామాలను రెడ్ గ్రామాలుగా విభజించమని తెలిపారు.