Husband killed wife baby in Anajpur: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలోని అనాజ్‌పూర్‌లో తీవ్ర విషాదం నింపిన భార్య, నెలన్నర పసికందు హత్య కేసులో విషాదకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో భార్యతో అగ్నిసాక్షిగా ఏడు అడుగులు నడిచిన భర్తే కాలయముడిగా మారాడు. భార్యను, కొడుకు కర్కశంగా చంపాడు. రెండేళ్ల తన పాప ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బండరావిరాలకు చెందిన కందికంటి నర్సింగ్ రావు కోటమ్మకు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె లావణ్య(28)కు 2018లో అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధనరాజ్‌తో వివాహం జరిపించారు. వీరికి రెండేళ్ల కూతురు ఆద్య, 42 రోజుల కుమారుడు క్రియాన్ష్ ఉన్నారు. కుమారుడు పుట్టినప్పటి నుంచి లావణ్య బండరావిరాలలోని తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి జరిగిన నాటి నుంచి ఏర్పుల ధనరాజ్ తన భార్య లావణ్యతో గొడవ పడుతూ అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవాడు.
ఈ విషయంమై రెండు మూడు సార్లు పెద్దల సమక్షంలో మాట్లాడి సముదాయించారు. అయినా ధనరాజ్ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే బుధవారం ధనరాజ్ బండరావిరాల వెళ్లి కొడుకుకు టీకా వేయించాలనే కారణం చెప్పి.. భార్య లావణ్యను ఇద్దరు పిల్లలను అనాజ్‌పూర్ గ్రామానికి తీసుకొచ్చాడు. అనాజ్‌పూర్ వచ్చిన తర్వాత కట్నం గురించి లావణ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే.. ఆమె తలపైబీర్ బాటిల్‌తో తలపై కొట్టి అనంతరం గొడ్డలితో నరికి హత్య చేశాడు.
"పెద్ద పాప ఆద్య ఇంటి నుంచి బయటకు వస్తేగానీ మాకు తెలియలేదు. అప్పటికే ధనరాజ్ బైక్‌పై వెళ్లిపోతున్నాడు.. అతని ఒంటిపై రక్తం మరకలు ఉన్నాయి. మేము అతన్ని ఏం జరిగిందని ప్రశ్నించాం.. అయినా మాకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు".- గ్రామస్థులు
"ఎంతో నమ్మకంగా మా ఇంటికి వచ్చి మా బిడ్డను తీసుకొచ్చాడు. బాబుకు సూది మందు వేయిస్తానని నమ్మబలికాడు. ఇంత దారుణానికి పాల్పడతాడని అనుకోలేదు. నమ్మించి ప్రాణం తీశాడు. అతన్ని కఠినంగా శిక్షించాలి".- మృతురాలి తల్లి