Hanumantha Rao Fire on Uttam Kumar : కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు విషయంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నతీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనుమంతరావు(Hanumanth Rao) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా అంబర్‌పేట సీటు తాను సిఫారసు చేసిన వ్యక్తిని కాదని.. ఓబీసీ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. శ్రీకాంత్ గౌడ్ తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టారని ధ్వజమెత్తారు. అంబర్‌పేట సీటు తాను లక్ష్మణ్ యాదవ్‌కు అడుగుతున్నానని.. గతంలో అక్కడ యాదవ్‌లు గెలిచిన చరిత్ర కూడా ఉందని ఆయన వివరించారు. గత ఎన్నికల్లో పొత్తుల్లో తనకు టికెట్ రాకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో తాను డబ్బులు తీసుకొని వెనక్కి తగ్గానని తనపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress Ambarapet Ticket Issue : హనుమంతరావు డబ్బులు తీసుకునే వ్యక్తినా అని ప్రశ్నించారు. డబ్బులకు అమ్ముడుపొతే సగం హైదరాబాద్ తనదే ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో బీసీ మీటింగ్ పెడుతానంటే.. అక్కడ పెట్టనీయలేదని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్(Uttam Kumar) రెడ్డికి బీసీ ఓట్లు కావాలి కాని.. బీసీ మీటింగ్ వద్దా అని నిలదీశారు. కాంగ్రెస్(Congress) నుంచి తనను బయటకు పంపేందుకు ఉత్తమ్ కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. తాను పార్టీ మారనని.. గాంధీ కుటుంబానికి విరాభిమానని పేర్కొన్నారు.
"ఉత్తమ్‌కుమార్ నేను గత ఎన్నికల్లో డబ్బులు తీసుకుని పోటీ చేయలేదని దిల్లీలో ప్రచారం చేస్తున్నాడు. సూర్యాపేటలో బీసీల బహిరంగ సభ పెడతానంటే వద్దని అడ్డుపడ్డాడు. ఆయన భార్యకు టికెట్ ఇప్పించుకున్నాడు. నన్ను బయటకి పంపించాలని చూస్తున్నాడు. నేను ఎక్కడికి పోను.. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటాను."