రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ స్వాతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పాలిటెక్నిక్ డిప్లొమా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో సాంకేతిక విద్యామండలి అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన సాంకేతిక విద్యామండలి అధికారులు విచారణ చేపట్టాగా.. అంతా వాస్తవమని తేలింది. ఈ వ్యవహారంపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు సాంకేతిక విద్యామండలి అధికారులు ఫిర్యాదుచేశారు. కళాశాల చీఫ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేషన్ అధికారి, మరో ఆచార్యుడి ద్వారానే ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బయటపడింది.
పరీక్షలు రద్దు..
ఈనెల 8 నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షలు కొనసాగుతున్నాయి. వాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు లీకేజీ అయినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈనెల 8,9 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకేజీ అయినట్టు తేలింది. దీంతో సాంకేతిక విద్యామండలి అధికారులు.. ఆయా తేదీల్లో జరిగిన పరీక్షలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. రద్దయిన పరీక్షలు ఈనెల 15, 16న పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో పరీక్షా కేంద్రం మూసివేశారు. కళాశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. కాలేజీ అనుమతి ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేషన్ అధికారి కృష్ణమూర్తి, ఆచార్యుడు కృష్ణమోహన్ ద్వారానే ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయని తేలడంతో వారి మీద ఫిర్యాదుచేశారు. సాంకేతిక విద్యామండలి ఫిర్యాదులో కేసునమోదుచేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
ఇంతకు ముందు ఇలాంటివి జరిగాయా..?
లీకేజీ వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది.. ఎంతమంది విద్యార్థులకు లీకైన ప్రశ్నాపత్రాలు చేరాయి.. కళాశాల సిబ్బంది గతంలో ఈ తరహా లీకేజీలు ఏమైనా చేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పూర్తిస్థాయిలో ప్రశ్నించిన తర్వాతే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీచూడండి:diploma semester exam paper Leak : డిప్లమా సెమిస్టర్ పరీక్షా పేపర్ లీక్.. వాట్సాప్లో షేర్