హైదరాబాద్ బీఆర్కే భవన్ నుంచి అన్ని శాఖల అధిపతులతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధిపై చర్చించారు. వాటి సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, మురుగునీరు, రోడ్లు, డంపింగ్ యార్డులు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల పరంగా విద్యుత్ పరిస్థితి, సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు వంటి సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.మౌళికవసతులపై నివేదిక రూపొందించాలన్నారు.
నాలాలు, చెరువులు, ఉద్యానవనాల అభివృద్ధి, వైకుంఠదామాల నిర్మాణం, బస్తీదవాఖానాల్లో మౌలికసదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుకు అవసరమైన ప్రభుత్వ భూములు, భవనాలను గుర్తించాలని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నానాటికీ పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక తయారుచేయాలని సైబారాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు.