నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేంద్రానికి చెందిన రేవల్లి రామకృష్ణ, మానసలకు ఏడాది కిందట వివాహమైంది. కుటుంబంలోని సమస్యలతో వీరి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం వీరు గొడవపడ్డారు. పురుగు మందు తాగి చనిపోతానని ఒకరినొకరు బెదిరించుకున్నారు.
మీ భార్య క్షేమంగానే ఉంది..
కోపంతో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రామకృష్ణ వెల్దండ ఎస్సై నర్సింహులుకు ఫోన్ చేశాడు. తన భార్య మానస పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటోందని తెలుపుతూ ఆమె ఫోన్ నంబరు ఇచ్చాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఫోన్ నంబరు ఆధారంగా లొకేషన్‌ను గుర్తించారు. అక్కడకు వెళ్లి మానసను అదుపులోకి తీసుకున్నారు. ఆమె పురుగు మందు తాగలేదని నిర్ధారించారు. వెంటనే పోలీసులు ఆమె భర్త రామకృష్ణకు ఫోన్‌చేశారు. మీ భార్య క్షేమంగానే ఉందని తెలిపారు.
నేను తాగేశా..
అయితే రామకృష్ణ తాను పురుగు మందు తాగానని ఎస్సైకు తెలిపాడు. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ సమీపంలో ఉన్నానని తన భార్య మానసకు లొకేషన్ పెట్టాడు. మానస వెంటనే వెల్దండ పోలీసులకు దాన్ని షేర్ చేసింది. వెల్దండ ఎస్సై నర్సింహులు వెంటనే కడ్తాల్ ఎస్సై హరిశంకర్‌గౌడ్‌కు విషయం చెప్పగానే ఆయన వెళ్లి రామకృష్ణను గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించారు.