రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పోలీస్ శాఖను కూడా వైరస్ వదలట్లేదు. 24 గంటలు శాంతిభద్రతల కోసం శ్రమించే వీరంతా ఇప్పుడు కొవిడ్ బారిన పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72మంది కొవిడ్ బాధితులయ్యారు.
పోలీసులపై పంజా విసిరిన కరోనా... గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్ - పోలీసులకు సోకిన కరోనా
11:25 January 18
హోం ఐసోలేషన్‌లో పోలీసులు
తాజాగా రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో సీఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా తేలింది. అటు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదు దారుల కోసం పీఎస్‌ల ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు.
సైబర్ క్రైమ్‌లో వైరస్ అలజడి..
హైదరాబాద్ సీసీఎస్, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్‌కి వెళ్లి వచ్చారు. ఆ టీమ్‌లోని ఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్సై నుంచి అందరికీ సోకినట్లు అనుమానిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉండగా.. చైతన్యపురి పీఎస్‌లో 8 మంది కానిస్టేబుళ్లు, వనస్థలిపురంలో ఒకరు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒకరికి కరోనా సోకింది. అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురు సిబ్బంది కొవిడ్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,447 కేసులు..