ఉచిత హామీలు ఇస్తూ కల్వకుంట్ల కుటుంబం ప్రజలను మోసం చేస్తోందని... దీనికి మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. హయత్‌నగర్ మండలంలో జాతీయరహదారి నుంచి బలిజగూడ వరకు రోడ్డు నిర్మాణానికి ఆరేళ్ల క్రితం శంకుస్థాపన చేసి.. నిధులు విడుదల చేయకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అక్కడి శిలాఫలాకానికి పాలాభిషేకం చేసిన ఎంపీ.. తెరాస ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2015 ఆగస్టు10న అప్పటి మంత్రులు కేటీఆర్, హారీశ్ రావు, మహేందర్ రెడ్డి రూ.11 కోట్లతో కవాడిపల్లి మీదుగా బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.
ఆరేళ్లుగా టెండర్లు ఎందుకు పిలవలేదు?: కోమటిరెడ్డి - హయత్‌నగర్ మండలంలో రోడ్ల నిర్మాణంపై ఎంపీ విమర్శలు
ఆరేళ్లవుతున్నా రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని బలిజగూడ వరకు రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేస్తున్నందుకే శంకుస్థాపన శిలాఫలకానికి పాలాభిషేకం చేసినట్లు ఆయన తెలిపారు.
ఆరేళ్లయినా టెండర్లు పిలవలేదు
రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఇప్పటికి ఆరేళ్లు గడిచినా... టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. సీఎం కుటుంబ సభ్యులు, మంత్రులు చేసిన వాటికే దిక్కులేకుంటే... ఎమ్మెల్యే పరిస్థితి ఏంటని దుయ్యబట్టారు. పనులు చేయకుండా.. ప్రజలను మోసం చేస్తున్నందుకు నిరసనగా శంకుస్థాపన శిలాఫలకానికి పాలాభిషేకం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ తన సొంత జిల్లాకు వందల కోట్లు ఇస్తూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రూ.11 కోట్లు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తాను ఎంపీగా రెండేళ్లలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. కేంద్రంతో కోట్లాడి ఎల్‌బీనగర్ నుంచి ఆందోల్ మైసమ్మ గుడి వరకు జాతీయరహదారి విస్తరణ పనుల కోసం రూ.545 కోట్లు నిధులు తెచ్చానని... వారం రోజుల్లో ఈ-టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.