రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం అదనంగా తీసుకునేందుకు కేంద్రం సుముఖత చూపటం లేదు. సాధారణ బియ్యం ఎంతయినా తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. యాసంగిలో కనీసం 50 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేవలం 24.75 లక్షల టన్నులే తీసుకుంటామంటూ గతంలో కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రావచ్చని సమాచారం. 30 లక్షల టన్నులైనా తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుండగా, ఆ అవకాశాలు లేనట్లేనని కేంద్ర మంత్రిత్వశాఖ వర్గాల సమాచారం.
నిల్వలున్నాయి
వాతావరణ మార్పుల కారణంగా యాసంగిలో పండే ధాన్యంలో సింహభాగం ఉప్పుడు బియ్యానికి మాత్రమే అనువుగా ఉంటాయి. గడిచిన సీజనులో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. వాటి నుంచి 62 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. నాలుగు నుంచి అయిదేళ్లకు సరిపోయేంత మొత్తంలో నిల్వలు ఉండటంతో ఈసారి ఉప్పుడు బియ్యం ఎక్కువగా తీసుకునే పరిస్థితి లేదని కేంద్రం చెబుతూనే ఉంది. ఇటీవల దిల్లీ వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం పలు దఫాలు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు సాగించింది. రాష్ట్ర ప్రభుత్వ వినతిపై పునఃపరిశీలన చేసిన అధికారులు... అదనంగా ఉప్పుడు బియ్యం తీసుకునే పరిస్థితి లేదని తేల్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలా?