కవలలుగా పుట్టడం ఆ కుటుంబంలో వారసత్వంగా కొనసాగుతోంది. ఇలాంటి అరుదైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసాగర్‌లో చోటు చేసుకొంది. కవలల్లో ఇప్పటికే ఒకరికి ఒకే కాన్పులో ముగ్గురు జన్మించగా... మరొకరికి నలుగురు ఉన్నట్లు స్కానింగ్‌లో తేల్చారు. బోయిన్‌పల్లి మండలం విలాసాగర్‌కు చెందిన శ్రీలతకు ముగ్గురు ఆడపిల్లలే. నిఖిత, లిఖిత కవలలుగా జన్మించగా పూజ వేరుగా జన్మించింది.
ఒకరికి ముగ్గురు...
నిఖిత, లిఖితకు ఒకేసారి వివాహం జరిపించగా ఇద్దరు గర్భవతులయ్యారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిజేరియన్‌లో లిఖితకు ముగ్గురు పిల్లలు కాగా ఇద్దరు మగపిల్లలు, పాప పుట్టినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు బరువు తక్కువగా ఉండటంతో ఇంక్యుబేటర్‌లో వైద్యం అందిస్తున్నారు.
మరొకరి నలుగురు...
మరోవైపు గర్భవతి నిఖితకు స్కానింగ్‌లో నలుగురు పిల్లలు ఉన్నట్లు వైద్యులు చెప్పారని తల్లి శ్రీలత తెలిపారు. ఇలా ఒకబిడ్డకు ఒకేసారి ముగ్గురు పుట్టడం... మరొకరికి నలుగురు ఉన్నట్లు తేలడం సంతోషంగా ఉందన్నారు. కాన్పు జరిగిన లిఖిత ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు.