కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని.. భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా దక్కలేదని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన బాధితులతో రాజన్నసిరిసిల్ల జిల్లా కొడిముంజ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు.
పరిహారం రాకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను బాధితులు నేతలకు వివరించారు. 18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ప్యాకేజీ ఇవ్వాలన్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల ఆందోళన కారణంగానే పరిహారం ఇవ్వడం లేదని సాకులు చెబుతున్నారని.. అందువల్ల డిసెంబర్ 31 వరకు ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.