రైతులంతా సంఘటితం కావాలనే రాష్ట్రంలో రైతు వేదిక భవనాలు ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ వేదికల్లో అంతర్జాల సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇక్కణ్నుంచి వ్యవసాయ విస్తరణాధికారులతో మాట్లాడొచ్చని చెప్పారు.
కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం - rythu vedika building in gambhiraopet
తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితుల్లో మార్పు వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తన సొంత నిధులతో నానమ్మ, తాతయ్యల పేరిట నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో పర్యటించిన కేటీఆర్.. తన సొంత నిధులతో.. నానమ్మ, తాతయ్యల పేరిట నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ప్రతి 5వేల ఎకరాలకు ఒక క్లస్టర్, ఒక విస్తరణాధికారి ఉండాలని అన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల పరిస్థితుల్లో వచ్చిన మార్పులను ప్రజలు గుర్తించాలని కోరారు.
తెలంగాణ రాకముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములను ప్రత్యేక రాష్ట్రం వచ్చాక.. 25 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల ప్రాంతంలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. చెరువు నిండా నీరు ఉంటే ఊరు బాగుంటుందన్న మంత్రి.. నీరు ఉన్నచోట అన్ని కులవృత్తులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
- ఇదీ చూడండి :దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలు: కేటీఆర్