తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి హామీ పథకాన్ని వీడని అసౌకర్యాల వెతలు - నీరులేదు.. నీడాలేదు..

గ్రామీణ పేదరిక నిర్మూలన, సుస్థిర వనరుల అభివృద్ధే లక్ష్యంగా పదమూడేళ్ల  కిందట ప్రారంభమైన జాతీయ ఉపాధిహామీ పథకంలోని అరకొర వసతులు కూలీలకు శాపంగా మారాయి. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నా కనీస వేతనం అందక, వసతులు లేక, ఎండ తీవ్రతకు మాడిపోతున్నవారు శ్రమజీవులు. తమకు కష్టపడటమే తప్ప  పనికి తగ్గ వేతనం, సకాలంలో పొందినది ఎప్పుడూ లేదంటూ వాపోతున్నారు వేతనదారులు.

struggles-in-mgnregs-schemes

By

Published : Apr 26, 2019, 3:51 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలకు వేతనదారులు మాడిపోతున్నారు. పని ప్రదేశంలో కనీసం నీడ కోసం టెంటు, ప్రథమచికిత్స సౌకర్యం, ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. వెంట తెచ్చుకున్న తాగునీరు గంటలోపే అయిపోతున్నందున దాహం తోనే పనులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

పనిప్పుడు మరి పైసలెప్పుడో...?

చెరువుల్లో పూడికతీత, నీటి కుంటలు తవ్వే సమయాల్లో నిలువ నీడలేక ఆపసోపాలు పడుతున్నారు. వేకువ జామునే వచ్చి మధ్యాహ్నం వరకూ ఎండకు ఒళ్లు కంది, చేతులు పగిలేలా కష్టం చేస్తున్నా కనీస వేతనం రావడంలేదని వాపోతున్నారు.

గ్రూపులో సభ్యుల్లో ఒక్కొక్కరికీ ఒక్కోరకంగా వేతనాలు వస్తున్నందున ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియడంలేదంటున్నారు. చేసిన పనికి నెలలు గడుస్తున్నా వేతనాలు అందటం లేదంటున్నారు.

నీరులేదు.. నీడాలేదు..

పని చేసే ప్రదేశంలో నీడ, ప్రథమచికిత్స, వంటి సౌకర్యాలు కల్పించాలని చట్టంలో పొందు పర్చినప్పటికీ అవి పత్రాలకే పరిమితమయ్యాయని వాపోతున్నారు. ఎండలో పనిచేసి నీరసించిపోతున్న తమకు కనీసం వేసవిలో ఓఆర్​ఎస్​ ప్యాకెట్లు, తాగు నీరు అందించాలని వేడుకొంటున్నారు. పనిదినాలను కుటుంబానికి 100 నుంచి 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉపాధి హామీ పథకాన్ని వీడని అసౌకర్యాల వెతలు
ఇదీ చదవండి: పది అడుగుల గుంత తవ్వితే.. సమృద్ధిగా నీరు!

ABOUT THE AUTHOR

...view details