Sircilla Driving School Funding ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిరిసిల్లలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్లో అన్ని జిల్లాల వారికి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు రూపకల్పన చేశారు. 2021 జులై 4న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ 20 ఎకరాల స్థలంలో ఏర్పాటుకు కృషి చేశారు. రెండేళ్లలో దాదాపు 1440మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటి వరకు 30శాతం కూడా పూర్తికాలేదు. ధీన్ దయాళ్ ఉపాధ్యాయ్ కౌశల్ యోజన పథకం కింద కేంద్రం మంజూరు చేసిన రూ.16 కోట్లలతో ఐదు ఎకరాల్లో పరిపాలన, వసతి గృహ భవనాలు, 15 ఎకరాల్లో డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మించారు.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో వాహనాలు నడపడంలో మెళకువలు తెలుసుకునేందుకు డిజిటల్ గ్రంథాలయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రైవింగ్ స్కూల్‌లో మూడున్నర కిలోమీటర్ల మేర నాలుగు లేన్లు, ఆరు లేన్ల ట్రాకులు ఏర్పాటుచేశారు. మొదట్లో శిక్షణ పొందిన వారందరికీ లైసెన్స్‌తోపాటు ధ్రువపత్రాలు కూడా అందజేసేవారు. కేంద్రం నిధుల విడుదల చేయకపోవడంతో.. ఈపథకంలో ప్రవేశాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు వసతి సౌకర్యం లేక శిక్షణ నిలిచిపోయింది.
ప్రతి అయిదేళ్లకోసారి లైసెన్స్ పునరుద్ధరణకు వచ్చే భారీ వాహన చోదకులకు మాత్రమే ఒకరోజు శిక్షణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం లైసెన్సు పునరుద్ధరణకు టైడ్స్‌లో శిక్షణ తప్పనిసరి చేస్తూ మే నెలలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వాహనాల డ్రైవర్లు కూడా లైసెన్స్ గడువు ముగియగానే పునరుద్ధరణ కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్తే.. వారు సిరిసిల్లలోని టైడ్స్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. రహదారులపై ప్రమాదాలకు ప్రధాన కారణాలు, సహాయక చర్యలు, రహదారి భద్రతా చట్టం, జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని సిగ్నలింగ్ వ్యవస్థ, డ్రైవర్ల ఆరోగ్య పరిరక్షణ వంటివి డిజిటల్ తెరపై అర్థమయ్యేలా వివరిస్తున్నారు.