Sircilla Ground water Level: కరవుకు మారుపేరుగా నిలిచిన రాజన్నసిరిసిల్ల జిల్లా ముఖచిత్రమే మారిపోతోంది. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న జల నిర్వహణ విధానాలతో దేశానికే సిరిసిల్ల ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటింటికీ ఇంకుడు గుంతలు, ఉపాధిహామీ పనులు, వాటర్ షెడ్ల నిర్మాణం... మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం వల్ల వేసవిలోనూ భూగర్భజలాలు అమాంతం పెరిగాయి. కాళేశ్వరంతో చెరువులు నిండువేసవిలోనూ మత్తడి దూకుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో ఆరుమీటర్లకు పైగా భూగర్భజలాలు పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కేసీఆర్ దూరదృష్టి వల్లే..
ground water increased in sircilla: భూగర్భజలాల పెరుగుదలకు తీసుకున్న చర్యలు వివరించాలని ముస్సోరిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను కోరింది. ఆ మేరకు సమగ్ర వివరాలతో వీడియో చిత్రీకరించి పంపించారు. జలనిర్వహణపై అధ్యయనం కోసం సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దూరదృష్టితో కేసీఆర్ చేపట్టిన జలవిధానాలకు దక్కిన గుర్తింపుగా కొనియాడారు.