Exports From Sircilla to Newyork:ఒకప్పుడు బీడీలు చుట్టిన సిరిసిల్ల అతివల చేతిలో.. ఇప్పుడు ప్రపంచ శ్రేణి వస్త్రాలు తయారవుతున్నాయి. అపెరల్ ఉత్పత్తులు నేరుగా న్యూయార్క్‌కు ఎగుమతి అవుతున్నాయి. జిల్లా వస్త్రోత్పత్తులకు ప్రత్యామ్నాయంగా అపెరల్ పరిశ్రమను నెలకొల్పాలనే ఉద్దేశంతో 2017లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ పార్కు ఏర్పాటుకు పెద్దూరులో 60 ఎకరాల మేర స్థలాన్ని కేటాయించారు.
Sircilla Apparel Park Started Manufacturing Garments : 2021లో ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ప్రభుత్వం రూ.14.50 కోట్లతో టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలను కల్పించింది. దీంతో బెంగళూరుకు చెందిన గోకుల్‌దాస్ సంస్థ.. గ్రీన్‌నీడిల్ పేరుతో ఇక్కడ అపెరల్ ఉత్పత్తులకు పరిశ్రమను ఏర్పాటు చేసింది. సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 500 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా.. ఇదే సంస్థలో ఉపాధిని కల్పించడంతో మహిళల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.
Garments Manufacture in Sircilla :2022 మే నుంచి మహిళలు, పురుషులు ఉపయోగించే ఇన్నర్‌వేర్‌లు, క్రీడా దుస్తుల ఉత్పత్తులను ప్రారంభించింది. మొన్నటి వరకు ఇక్కడి ఉత్పత్తులను బెంగళూరు సంస్థ ద్వారా విదేశాలకు ఎగుమతి చేసేవారు. తాజాగా సిరిసిల్ల వస్త్రోత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అనుమతులు లభించాయి. దీంతో గ్రీన్‌నీడిల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన గ్యాప్ ఆర్గానిక్ 18,000 కాటన్ బాక్సర్స్ బ్రీఫ్స్‌ను ముంబయి మీదుగా న్యూయార్క్‌కు ఎగుమతి చేశారు.