రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ నెలాఖరు కల్లా లక్షా 24 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం పర్యటించారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలను, కొవిడ్ వ్యాక్సినేషన్, పరీక్షలకు సంబంధించిన వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు సంసిద్ధం...
జిల్లాలో కరోనా బారిన పడ్డ రోగులకు సరిపడే అన్ని సౌకర్యాలు జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని... వారికి చికిత్స అందించేందుకు వైద్యులు సంసిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,200ల యాక్టివ్ కేసులు ఉండగా... 18 మంది మృతి చెందినట్లు తెలిపారు. త్వరలోనే వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వైద్య సిబ్బందిని వారం రోజుల్లోనే నియామకం చేసి సకల సౌకర్యాలతో ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మళ్లీ రాష్ట్రంలో కర్ఫ్యూ, లాక్డౌన్ పరిస్థితులు రావద్దంటే ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలని కోరారు.
గ్రంథాలయం పరిశీలన...
జిల్లా కేంద్రంలోని ఆధునిక గ్రంథాలయాన్ని కేటీఆర్ పరిశీలించారు. అక్కడే ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో ముచ్చటించారు. గ్రంథాలయంలో సరిపడా వసతులున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో అదనపు కంప్యూటర్లు కావాలని వారు కోరారు. ప్రత్యేక గదిలో ప్రోజక్టర్‌ను ప్రారంభించారు. జిల్లాకు మంజూరైన బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అభ్యర్థులకు వివిధ పాఠ్యాంశాలపై నిపుణులైన అధ్యాపకులతో ప్రత్యక్ష బోధన అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.
యూపీఎస్సీ గ్రూప్స్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి సంబంధిత స్టడీమెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే జిల్లా యువతకు ఆధునిక వసతులతో కూడిన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
అభివృద్ధి పనులు...