తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయాన్ని పండుగ చేయడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్ - సిరిసిల్లలో రైతు బజార్​ ప్రారంభం

వ్యవసాయాన్ని పండుగలా చేయడమే సీఎం లక్ష్యమని.. అందుకనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రైతుబంధు, రుణమాఫీ అమలు చేస్తున్నట్లు వివరించారు. సిరిసిల్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రైతుబజార్​ను ప్రారంభించిన మంత్రి... రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఈ తరహా మార్కెట్లను ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు.

Minister ktr started the raithu bazar in siricilla
అభివృద్ధిలో సిరిసిల్ల దేశానికే ఆదర్శంగా నిలవాలి: కేటీఆర్

By

Published : Jun 23, 2020, 8:32 PM IST

అభివృద్ధిలో సిరిసిల్ల దేశానికే ఆదర్శంగా నిలవాలి: కేటీఆర్

కరోనా సంక్షోభంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ప్రజలకు ఆకలి బాధలు లేకుండా చేసిన సర్కారు... ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో రూ. 5.15 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రైతుబజార్, రూ. 41 లక్షలతో నిర్మించిన పార్కును మంత్రి ప్రారంభించారు. అనంతరం మానేరు తీరాన నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

దేశానికే ఆదర్శంగా..

రైతులు నేరుగా తమ ఉత్పత్తులను రైతుబజార్లో అమ్ముకునేలా సౌకర్యాలు కల్పించామన్న కేటీఆర్... 223 మంది వ్యాపారం చేసుకునేలా దుకాణాలు నిర్మించామని తెలిపారు. రైతు బజార్లోని వ్యాపారులతో మాట్లాడిన మంత్రి... ప్లాస్టిక్​ని నిషేధించాలని కోరారు. పరిశుభ్రత పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చెందుతుందన్న మంత్రి... రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఈ తరహా రైతుబజార్లను ఏర్పాటుచేస్తామన్నారు.

సీఎం పనితీరు నిదర్శనం..

ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేయడం సీఎం పనితీరుకు నిదర్శనమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నామన్న ఆయన... రోహిణి కార్తెలో కూడా చెరువులు నింపిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందన్నారు.

వ్యవసాయానికి మహర్దశ..

దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలను అందిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షోభ సమయంలోనూ ఒక్క రోజులోనే 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో.. రైతుబంధు డబ్బులు జమా అయ్యాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి మహర్దశ పట్టనుందని, విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు.

పెద్దఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలు..

రైతు ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా... రాష్ట్రంలో పెద్దఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో అధిక సంఖ్యలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగనున్నాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:తెలంగాణ వార్షిక వృద్ధిరేటు 8.2 శాతం.. నివేదిక విడుదల చేసిన కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details