నేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కేటీఆర్ అన్నారు. కార్మికులు నైపుణ్యంతో పనిచేస్తున్నారని, వారి కష్టానికి తగిన కూలీ వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వస్త్ర ఉత్పత్తి సంఘాల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని నేతన్నలు నైపుణ్యంతో పనిచేస్తున్నారని.. ఫలితంగానే నాణ్యమైన బతుకమ్మ చీరల ఉత్పత్తి సకాలంలో జరుగుతోందన్నారు. సిరిసిల్ల నేత కార్మికులు ఇప్పటివరకు 2 వేల కోట్లకు పైగా ప్రభుత్వ ఆర్డర్లు పూర్తిచేసినట్లు కేటీఆర్ తెలిపారు.
డిజైన్లు ఎక్కువగా ఉన్నందు వల్ల ఎక్కువ మరమగ్గాలు నడపడం.. నేత కార్మికులకు కష్టం అవుతోందని తద్వారా వారికొచ్చే వేతనం తగ్గే అవకాశం ఉందని పలువురు యజమానులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు... నాణ్యత సరిగా లేదంటూ... జౌళి శాఖ అధికారులు పెనాల్టీ వేసిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ జరిమానాను రద్దుచేయాలని కేటీఆర్‌ను కోరారు. కాటన్ వస్త్ర పరిశ్రమకు సంబంధించి స్పిన్నింగ్ మిల్లుల యజమానులతో చర్చలు నిర్వహించి.. సిరిసిల్లలో తయారయ్యే వస్త్రానికి కావాల్సిన యారన్ డిపోను ఏర్పాటు చేసేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.
బెంగళూర్‌కు చెందిన ప్రముఖ కంపెనీ తయారు చేసిన మరమగ్గాలను సిరిసిల్లకు పరిచయం చేసేలా కాటన్ వస్త్ర పరిశ్రమ యజమానులు శ్రద్ధ చూపాలని కోరారు. ఈ సందర్బంగా సదరు సంస్థ ప్రతినిధులు వారు రూపొందించిన మరమగ్గాల పనితీరును ల్యాప్‌టాప్ ద్వారా మంత్రికి వివరించారు. ఆయా మరమగ్గాల మీద తయారుచేసిన వస్త్రాన్ని మంత్రికి అందించారు.