KTR Inspiring Words: నిరంతరం రాజకీయాలతో బిజీబిజీగా ఉండే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ఇవాళ తనలో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నిరుద్యోగుల్లో ఆయన స్ఫూర్తి నింపారు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ కళాశాలలో కేటీఆర్ ప్రేరణ పాఠం చెప్పారు. ముస్తాబాద్ ప్రభత్వ కళాశాలలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కేటీఆర్.. వారిలో స్ఫూర్తిని నింపారు. లక్షలాది మంది పోటీపడుతున్న పరీక్షల్లో విజేతలుగా నిలవాలంటే కష్టపడి చదవాలని సూచించారు. ప్రిపరేషన్ సమయంలో సెల్ఫోన్లను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యమ నినాదం నీళ్లు, నిధులు, నియమకాలు కలసాకారం చేసుకున్నామని కేటీఆర్ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. నీళ్లు సాధించుకోవడంతో పాటుగా మన నిధులు మన కోసమే ఖర్చు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. నియామకాల ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి వివరించారు.
దేశంలో భౌగోళికంగా తెలంగాణ 11వ పెద్ద రాష్ట్రం. జనాభా ప్రాతిపదికన తెలంగాణ 12వ పెద్ద రాష్ట్రం. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాల్లో తెలంగాణది 4వ స్థానం. అభివృద్ధికి ప్రామాణికాలు తలసరి ఆదాయం, జీఎస్‌డీపీలో రాష్ట్రం ముందంజలో ఉంది. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్ష 24 వేలుగా ఉంటే... ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం రూ.2లక్ష 78 వేలుగా ఉంది. దేశ సగటు తలసరి ఆదాయం రూ.లక్ష 49వేలు. 2014లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ఆదాయం రూ.5లక్షల కోట్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) ఆదాయం రూ.11లక్షల55వేల కోట్లు. దేశ జనాభాలో తెలంగాణది 2.5 శాతం ఉంది. దేశ జీడీపీకి తెలంగాణ 5 శాతం తోడ్పాటునందిస్తోంది. -- కేటీఆర్, మంత్రి
నియామకాల కోసం టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రైవేటు రంగంలో పరిశ్రమలను ఆహ్వానించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలోనూ నియామకాలు చేపడుతున్నామన్న ఆయన... ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఎవరూ నిరాశ చెందవద్దని సూచించారు. ప్రైవేటు రంగంలో అవకాశాలు ఉన్నాయని మర్చిపోవద్దని విజ్ఞప్తి చేశారు. చదువు, నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవలేదని చెప్పారు.