రాజన్న సిరిసిల్ల(Rain Effect in Sircilla) జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జోరుగా కురుస్తున్న వానలతో జిల్లావ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగుతున్నాయి. సిరిసిల్ల పట్టణమంతా జలమయం అయింది. పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతమైన పాత బస్టాండ్ పెద్ద బజార్ వెంకంపేట రహదారి వరద నీటితో నిండిపోయింది. అక్కడి నీటి ప్రవాహానికి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా... స్థానికులు కాపాడారు.
ప్రొక్లెయిన్‌తో తరలింపు
సిరిసిల్ల పట్టణంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ప్రధాన కాలనీలన్నీ జలమయం అయ్యాయి. కాగా వినాయకుడికీ ఈ వరద కష్టాలు తప్పలేదు. రహదారుల మీద ప్రవహిస్తున్న వరద నీటిలో గణేశుని విగ్రహం కొట్టుకుపోయింది. వాననీటిలో వినాయకుడిని చూసి... స్వామికీ తప్పలేదా? వరద కష్టాలు అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాగా వరద బాధితులను ప్రొక్లెయిన్‌తో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కాలనీలు జలమయం
సిరిసిల్లలోని ప్రగతినగర్, సాయినగర్, అంబికానగర్, శాంతినగర్, గాంధీనగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొత్తకలెక్టరేట్ ప్రాంగణంలోనూ భారీగా వర్షపు నీరు చేరింది. సిరిసిల్లలో విద్యాసంస్థలకు.. కలెక్టర్ అనురాగ్ జయంతి సెలవు ప్రకటించారు. సహాయక చర్యల కోసం అధికారులను అప్రమత్తం చేశారు. ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం 9398684240 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
సిరిసిల్లకు డీఆర్ఎఫ్ బృందాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా(Rain Effect in Sircilla)లో రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కొత్తచెరువు మత్తడి దూకడం వల్ల సిరిసిల్ల-కరీంనగర్ రహదారిలోని దుకాణాల్లోకి నీరు చేరింది. కాళేశ్వరం 9వ ప్యాకేజీ సొరంగంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగుపారుతున్నాయి. సిరిసిల్లలో వర్షబీభత్సంపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంత్రి ఆదేశాలతో రెండు డీఆర్ఎఫ్ బృందాలు హైదరాబాద్‌కు బయలుదేరాయి. బోట్లు, సహాయ చర్యల పరికరాలతో వెళ్తున్నాయి. వెంటనే వరద సహాయక చర్యలు చేపట్టనున్నాయి.
ఇవీ చదవండి: