తెలంగాణ

telangana

ETV Bharat / state

Heavy Rain in Sircilla : సిరిసిల్లలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

గులాబ్ తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగారు.

సిరిసిల్లలో భారీ వర్షం
సిరిసిల్లలో భారీ వర్షం

By

Published : Sep 28, 2021, 12:07 PM IST

సిరిసిల్లలో భారీ వర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిరిసిల్ల- కరీంనగర్ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద ఉద్ధృతి కొనసాగడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువనున్న బోనాల పెద్ద చెరువు పొంగి పొర్లడం వల్ల పట్టణంలోని వెంకంపేట, అంబికానగర్, అశోక్ నగర్, సంజీవయ్య నగర్, శాంతి నగర్, అంబేడ్కర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది.

రాత్రి నుంచి వరద ఉద్ధృతి కొనసాగడం వల్ల జనజీవనం స్తంభించింది. శాంతినగర్, అంబేడ్కర్‌ కాలనీ వాసులను జిల్లా, మున్సిపల్ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న వరద ఉద్ధృతి.. సాయంత్రం వరకు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.

జిల్లాలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో మురికి కాల్వలు పొంగి రహదారులపైకి మురుగు నీరు చేరుతోంది. ఆ వాసనతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతోందని వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి.. ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

మరోవైపు.. పలు మండలాల్లో వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు పొంగి అలుగు పారుతున్నాయి. కానీ అలుగు అందాలు చూడాలనుకుంటే.. ఎడతెరిపి లేకుండా వాన పడుతోందని స్థానికులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు అలుగు పారి రహదారులపైకి వరద నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details