Farmers expo organized in Rajanna Sirisilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోకి.. రైతులు, స్వశక్తి సంఘాల నుంచి అపూర్వ స్పందన లభించింది. వరి, మిర్చి, పసుపు, పప్పులు వంటి పంటలు పండించిన తర్వాత వ్యవసాయ క్షేత్రాల వద్దే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు. రైతులు పండించిన పంటలకు అదనపు విలువ కలిసి రావడమేకాకుండా మరికొందరు ఉపాధి పొందే అవకాశం ఉందని తెలిపారు.
ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా అందించే సహకారంపై చైతన్యం కల్పించారు. రైతులు పండించిన పంటలను యధావిధిగా విక్రయించకుండా ప్రాసెసింగ్ చేసే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకొనేందుకు యువతతో పాటు స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ సహకార పరపతి సంఘం వంటి వాటికి అణువుగా ఉంటుందని తెలిపారు. ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తే అధిక లాభాలు గడించే అవకాశం ఉందన్న అంశంపై అవగాహన కల్పించారు.