Congress Padayatra: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. చింతన్ శిబిరంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏఐసీసీ పిలుపు మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా శ్రేణులు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణాల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఏఐసీసీ పిలుపుమేరకు రాష్ట్రమంతా కార్యక్రమం చేపట్టారు. స్వాతంత్య్ర సంగ్రామ ఉద్యమస్ఫూర్తిని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభించారు. 75 కిలోమీటర్ల తగ్గకుండా కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. భాజపా ప్రభుత్వం గాడ్సెను గౌరవిస్తూ..మహత్మాగాంధీని అవమానిస్తుందని
భట్టి విక్రమార్క మండిపడ్డారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజి నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రేణులతో ఉత్సాహంగా నడిచారు. ఇందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతోపాటు సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ములుగులోని గట్టమ దేవాలయం నుంచి ఎమ్మెల్యే సీతక్క యాత్ర ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలన ప్రజలకు తెలియజేస్తామని వ్యాఖ్యానించారు..