రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్రారంభోత్సవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎరువుల సరఫరాకు సంబంధించిన పనులను ఈ ఏడాది జూన్ వరకు పూర్తి చేసి ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభిస్తామని యాజమాన్యం గతంలో ప్రకటించింది. కర్మాగారంలో ఇటీవల ప్రమాదాలు చోటుచేసుకోవడంతోపాటు కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. ఈ కారణాలతో కిసాన్ బ్రాండ్‌కు చెందిన యూరియా, అమ్మోనియా ఎరువులు రైతులకు ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
సహజవాయువును ఇంధనంగా వినియోగించే ఈ కర్మాగారం ప్లాంటులో ‘కిసాన్’ బ్రాండ్ పేరిట భవిష్యత్తులో యూరియా, అమ్మోనియా ఎరువులను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రతి రోజు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఎరువుల ఉత్పత్తికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా మల్లవరం నుంచి ఈ కర్మాగారం వరకు 363 కిలోమీటర్ల గ్యాస్ పైప్‌లైనును నిర్మించారు. యూరియా స్టోరేజీ ట్యాంకు పనులూ పూర్తయ్యాయి. అమ్మోనియా ట్యాంకులకు సంబంధించిన విడిభాగాల బిగింపు, తొలగింపు పనులను పూర్తిచేసి అదనపు సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంది.