పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఉపాధి హామీ, నర్సరీ పనులను జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువల మరమ్మతు పనులకు ప్రాధాన్యత కల్పిస్తూనే వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
'సాగునీటి కాలువల మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేయాలి '
పెద్దపల్లి జిల్లాలో ఉన్న సాగునీటి కాలువల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామంలో అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు కల్పించటంతో పాటు తప్పనిసరిగా ఉపాధి హామీ పని కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా నర్సరీలో మొక్కల సంరక్షణకు నీటి సరఫరా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హరితహారం లక్ష్యాల మేరకు గ్రామంలో మొక్కలు నాటేందుకు నర్సరీలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. గ్రామంలో పల్లె ప్రగతి పనులు పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని పాలనాధికారి సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.