కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజవకర్గంలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి.. కల్యాణ ఘట్టాన్ని నిర్వహించారు.
నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లోని పలు ఆలయాల్లో అర్చకులు కల్యాణ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులను అనుమతించలేదు.
కొత్తపల్లిలో..
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ ఆలయంలో వేద పండితుల నడుమ స్వామి వారి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. కల్యాణానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులు హాజరయ్యారు. వేడుకల్లో శ్రీ సచ్చిదానంద ఆశ్రమం నిర్వాహకులు, కొత్తపల్లి పురపాలక సంఘం ఛైర్మన్ రుద్రరాజు, వైస్ ఛైర్మన్ గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గోపాల్రావుపేటలో..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులు హాజరు కాగా.. సీతారాముల కల్యాణోత్సవాన్ని పూజారులు ఘనంగా నిర్వహించారు.
మెట్పల్లిలో..
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అర్చకుల వేద మంత్రాల మధ్య కన్నుల పండువగా జరిగింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏటా రాముల వారి కల్యాణం వేలాది మంది భక్తుల మధ్య జరిగేది. కరోనా వైరస్ ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం కేవలం 12 మంది భక్తులు మాత్రమే కల్యాణానికి హాజరయ్యారు.
కొండగట్టులో..
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో రాములోరి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. కేవలం అర్చకులు, ఆలయ అధికారులు మాత్రమే హాజరైన స్వామి వారి కల్యాణం.. శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకముందు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.