నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లారంపూర్లో ఎంపీ అర్వింద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సహకార సొసైటీలో డిపాజిట్ల అక్రమాలు జరిగాయంటూ రైతుల చేపట్టిన ఆందోళనలో పాల్గొనడానికి వెళ్లిన అర్వింద్ కాన్వాయ్‌ను.. పసుపు రైతులు అడ్డుకున్నారు. బోర్డ్ ఏర్పాటుకు బాండ్ పేపర్ రాసి ఇచ్చి.. ఇంత వరకు నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. ఎంపీ.. రైతులతో మాట్లాడడానికి ప్రయత్నిచినా ఫలితం లేకపోగా.. వారు భాజపాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళన కారులను చెదరకొట్టారు.
మీ వాటా ఎంత..?
బాల్కొండ నియోజకవర్గంలో.. సొసైటీలో అవినీతి జరుగుతుంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. రూ. 20 కోట్ల అవినీతి జరుగుతుంటే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అక్రమాలలో వాటా ఎంతని మంత్రిని ప్రశ్నించారు. సొసైటీ రైతులకు డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాధితులకు న్యాయం జరిగే వరకు భాజపా కార్యకర్తలు పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు.
ఏదీ చేతకాదు..
ప్రభుత్వం.. వరి, మొక్కజొన్నలను సరైన సమయంలో కొనడం లేదన్నారు అర్వింద్. రైతులకు ఫర్టిలైజర్లు, యూరియాలు.. ఉచితంగా ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పసుపునకు తక్కువ ధర వచ్చినప్పుడు కేంద్రానికి లేఖ రాయమంటే రాయలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఏ డిబెట్లో మాట్లాడటానికైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. కేంద్రం.. రైతులకు అధిక ధర వచ్చేలా చేసిందని వివరించారు.
అక్రమాలను బయట పెడుతున్నందుకే..
తెరాస అక్రమాలను బయట పెడుతున్నామనే.. కార్యకర్తలను పంపించి తమను అడ్డుకుంటున్నారు. భాజపా శ్రేణులు అన్ని చూస్తునే ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నట్లే తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటారు. మంత్రి కేటీఆర్ పర్యటిస్తే ముందస్తు అరెస్ట్‌లు చేసినప్పుడు.. ఓ ఎంపీ పర్యటించినప్పుడు చేయరెందుకు..? నిజామాబాద్ పర్యటనలో ఇక ముందు బాల్కొండ నియోజకవర్గంలోనే తిరుగుతా. పసుపు రైతులు ఉన్న గ్రామాల్లో పర్యటిస్తా. ఎవరు ఆపుతారో చూస్తా. మేము తలుచుకుంటే ఎంపీ ప్రశాంత్ రెడ్డి ఇంట్లో నుంచి బయట కూడా అడుగుపెట్టలేడు.