తెలంగాణ

telangana

ETV Bharat / state

folk singer ganga: పాటతో నిలిచింది.. అందరి మనసు గెలిచింది! - తెలంగాణ వార్తలు

పుట్టిన పదిరోజులకే తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు... అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు కొన్నాళ్లు చదువుకి దూరం చేశాయి. అయినా తన ప్రతిభ మాత్రం... ఆ అమ్మాయికి ఎనలేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. గాయనిగా... వందల ఏళ్ల నాటి జానపదాలను సేకరించి కొత్త ఊపిరులూదే శక్తినిచ్చింది (telangana folk singer ganga). ఆమే నిజామాబాద్‌కు చెందిన గంగ. ఆమె విజయ ప్రస్థానం సాగిందిలా!

singer ganga
singer ganga

By

Published : Oct 31, 2021, 10:34 AM IST

వకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. సద్వినియోగం చేసుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలి’... అలాంటి ప్రయత్నంతోనే గంగాదేవి తనకో గుర్తింపుని తెచ్చుకోగలిగింది (telangana folk singer ganga). గంగకు చిన్నతనం నుంచే పాటలంటే మక్కువ. సాయమ్మ, మల్లయ్య దంపతుల ఇద్దరు కూతుళ్లలో గంగ చిన్నది. ఆమె పుట్టిన పది రోజులకే నాన్న ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. పసికందైన తననీ, అక్కనీ వెంటపెట్టుకొని అమ్మ డిచ్‌పల్లిలోని పుట్టింటికి చేరింది. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. తర్వాత పిల్లలిద్దర్నీ స్థానిక పాఠశాలలో చేర్చింది. గంగ చదువుతోపాటు ఆటపాటల్లోనూ చురుకే. ఆమె ప్రతిభను గుర్తించాడో ఉపాధ్యాయుడు. స్కూల్లో ఏ ప్రత్యేక సందర్భమైనా తనతో పాడించే వారు. ఈలోగా అనుకోని అనారోగ్యం. రెండేళ్లు చదువు, పాటలకి దూరమైంది. కోలుకున్నాక అమ్మ ప్రోత్సాహంతో ప్రైవేట్‌గా పదో తరగతి రాసి ప్రథమ శ్రేణిలో పాసైంది.

అక్క చదువులో టాపర్‌. గంగేమో అమ్మ కష్టాన్ని చూసి చదువాపేసి ఇందిరా క్రాంతి పథకంలో కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌గా చేరింది. మహిళా సంఘాల సమావేశాలకి వచ్చినవారు తన గురించి తెలిసి అడిగి మరీ పాటలు పాడించుకునే వారు. ప్రభుత్వ పథకాలు, ప్రచారాలకూ పాడించే వారు. క్రమంగా జిల్లాలో ఏ కార్యక్రమం నిర్వహించినా గంగ పాట తప్పనిసరైంది. ఇలా రెండేళ్లు గడిచాయి. చదువు వైపు మనసు మళ్లి.. ఇంటర్‌లో చేరింది. ఓసారి జానపద పాటల పోటీల సెలక్షన్స్‌ నిజామాబాద్‌లోనే జరుగుతున్నాయని తెలిసి వాళ్ల అక్క అమ్మక్కూడా చెప్పకుండా గంగని తీసుకెళ్లింది. వీళ్లెళ్లేసరికి కార్యక్రమం పూర్తయ్యింది. ఒక్క అవకాశమివ్వమని బతిమిలాడారు ఇద్దరూ. న్యాయనిర్ణేతల్లో ఓ పెద్దాయన గంగ గొంతువిని అవకాశమిచ్చారు. నచ్చడంతో వివరాలు తీసుకుని వెళ్లిపోయారు. అప్పటికి వాళ్లకి ఫోన్‌ కూడా లేదు. పక్కింటివాళ్ల నంబరే ఇచ్చారు. దానికే ఆమె ఎంపికైందన్న సందేశం వచ్చింది.

అమ్మవద్దన్నా...

ఈ కబురు చెబితే అమ్మ హైదరాబాద్‌ పంపడానికి భయపడింది. ఊరి పెద్దలు తల్లికి నచ్చజెప్పారు. వాళ్లే ఆర్థిక సాయమూ చేస్తామనడంతో ఒప్పుకుంది. అలా గంగ హైదరాబాద్‌కి చేరింది. ఆ కార్యక్రమంలో మంచి పేరూ తెచ్చుకుంది. తర్వాత ఇతర ఛానళ్ల పాటల ప్రోగ్రాముల్లోనూ అవకాశం దక్కించుకుంది. ఆపై తెలంగాణ ఉద్యమంలో రసమయి బాలకిషన్‌ బృందంలో చేరి కాలికి గజ్జెకట్టి ఆడి, పాడింది. గంగ ప్రతిభను గుర్తించిన ప్రజాగాయకుడు జంగిరెడ్డి 2011లో ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్‌ తీసుకెళ్లారు. అది మొదలు తను ఇప్పటివరకూ 12 దేశాలు తిరిగింది. కెరియర్‌లో పేరు సంపాదించాక సుదర్శన్‌ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఉద్యమంలో పాల్గొన్నందుకుగానూ తెలంగాణ సాంస్కృతిక సారథిగా హైదరాబాద్‌లో ఉద్యోగం దక్కింది.

తన పాటలకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న గంగ 2016లో రాష్ట్ర ఉత్తమ గాయనిగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పురస్కారం అందుకుంది. ఇప్పటివరకూ ఐదువందలకు పైగా పాటలు పాడింది. వాటిల్లో ‘పలుగురాళ్ల పాడుల దిబ్బ’, ‘వెన్నెలకీ వచ్చినయూ జొన్నల బండ్లు’, ‘పుట్టామీద పాలపిట్టా జాజి మొగిలాల’, ‘పున్నాపు వలలో పూసీ కాయంగా’...వంటివి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. రేలారే గంగా పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించింది. దానిలో ఉంచే తన పాటలు కొన్నింటికి కోట్ల వీక్షణలున్నాయి.‘పూర్వం ప్రతిదానిపై పాటకట్టేవారు. కాలక్రమేణా అవి కనుమరుగవుతున్నాయి. వందల ఏళ్ల వాటిని ఈ తరానికి పరిచయం చేయాలని సేకరించి, పాట రూపంలో అందిస్తున్నా. అదృష్టం కొద్దీ నాకు అవకాశాలొచ్చాయి, వినియోగించుకున్నా. కానీ ప్రతిభ ఉండీ అవకాశం రాని వాళ్లెందరో. వాళ్లని వెలుగులోకి తేవడం నా లక్ష్యం’ అనే గంగ (telangana folk singer ganga)... తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా స్వయంగా అవకాశమిచ్చి మరీ వాళ్లని పరిచయం చేస్తోంది.

ఇదీ చూడండి:టాప్​-10 పాప్​ సింగర్​లలో ఒకదాన్నవుతా..

ABOUT THE AUTHOR

...view details