తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది: రేవంత్​రెడ్డి

Revanth Reddy on Crop Damage in Telangana: రాష్ట్రంలో అకాల వర్షాలతో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. ఆ రైతులందరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. కేసీఆర్​ సర్కార్​ రైతు బీమా కాదు.. పంట బీమా పథకం అమలు చేసి అన్నదాతలకు అండగా నిలవాలని హితవు పలికారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Mar 20, 2023, 4:00 PM IST

Revanth Reddy on Crop Damage in Telangana: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని సుంకిని పోతాంగల్​లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పరిశీలించారు. అకాల వర్షాల వల్ల మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు రేవంత్​ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి అందించి.. పరిహారం అందేలా చూడాలని డిమాండ్​ చేశారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ హయాంలో అకాల వర్షాలకు పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకున్నట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. అన్నదాతలకు ఎకరాకు రూ.40 వేల వరకు సాయం అందించినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక​ ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, పనిముట్లపై సబ్సిడీ ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్​ రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పంట బీమా పథకాన్ని నీరుగార్చారని.. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా పథకం రాష్ట్రంలో లేకపోవడంతో రైతన్నలు నష్టపోతున్నారని తెలిపారు. 2021లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఒకే మండలంలో 8 వేల ఎకరాల పంట నష్టం జరిగితే.. 15 నెలలు గడుస్తున్నా పరిహారం అందించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ చేతకానితనానికి ఇదొక నిదర్శనమన్నారు.

బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు..: తక్షణమే ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మారారని.. పంట నష్టం జరిగి రైతులు బాధపడుతుంటే ఆ పార్టీ నేతలు ఎందుకు క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదని ప్రశ్నించారు. రైతులకు అండగా నిలవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని.. కేంద్రం తక్షణమే బృందాలను పంపి ఇన్​పుట్ సబ్సిడీ అందించాలన్నారు. కేసీఆర్​ సర్కారు రైతు బీమా కాదు.. పంట బీమా పథకం అమలు చేయాలని రేవంత్​ హితవు పలికారు.

''వ్యవసాయ, రెవెన్యూ అధికారులు తక్షణమే గ్రామాల్లో పర్యటించి పంట నష్టంపై నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలి. ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించి పరిహారం అందేలా చూడాలి. బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహాలుగా మారారు. పంట నష్టం జరిగి రైతులు బాధపడుతుంటే ఆ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో ఎందుకు పర్యటించడం లేదు. కేంద్రం తక్షణమే బృందాలను పంపి ఇన్​పుట్ సబ్సిడీ అందించాలి. కేసీఆర్​ సర్కార్​ రైతు బీమా కాదు.. పంట బీమా పథకం అమలు చేయాలి.'' - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది: రేవంత్​రెడ్డి

ఇవీ చూడండి..

'పంట నష్టాన్ని అంచనా వేస్తున్నాం.. రైతులను ఆదుకుంటాం'

రైతుల పేరిట రాజకీయం వద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details