పదో తరగతి పరీక్షలు విద్యార్థుల ఉజ్వల భవితవ్యానికి కీలక ఘట్టం. అయితే పరీక్షలు రాసే కేంద్రాలు వారి భవిష్యత్‌కు గండి కొట్టేలా కనిపిస్తున్నాయి. అధికారుల అలసత్వం, ప్రభుత్వాల నిర్లక్ష్యం... వెరసి విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఏళ్లతరబడి అరకొర వసతుల మధ్యే విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయాల్సి వస్తోంది. ప్రతి ఏటా అవే సమస్యలు వేధిస్తున్నా... అధికారులు మాత్రం మిన్నకుంటున్నారు. దీనితో సరైన వెలుతురు లేకపోవడం, తిరగని ఫ్యాన్లు, బెంచీలు లేక కింద కూర్చొని పరీక్షలు రాయాల్సి వస్తోంది.
ఇందూరు వివరాలిలా...
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 503 పాఠశాలలు ఉన్నాయి. పదోతరగతి పరీక్షల కోసం 136 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా... 12,013 మంది బాలురు, 11,507మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 279 పాఠశాలలు ఉండగా.. 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 6,231మంది బాలురు, 6,520మంది బాలికలు పరీక్షలు రాయబోతున్నారు. అయితే చాలా పాఠశాలలో డెస్క్ బెంచీల కొరత తీవ్రంగా ఉంది. కింద కూర్చొని విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది. అధిక శాతం పాఠశాలలో కిటికీలు, తలుపులు సరిగ్గా లేవు. అలాగే కొన్ని పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేక, మరికొన్నింటిలో ఫ్యాన్లు లేక విద్యార్థులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలంలో విద్యార్థుల ఇబ్బందులు మరింత అధికం కానున్నాయి. ఇవి కాకుండా సరైన వెలుతురు లేకపోవడం కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. అవస్థల మధ్య పరీక్షల మీద దృష్టి కేంద్రీకరించలేకపోతామని.. కనీస వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.