నిజామాబాద్ జిల్లాలో ప్రతి విద్యార్థి మాస్కుతో రావాలని పాఠశాలల యాజమాన్యాలు చెప్పగా తల్లిదండ్రులు ఉరుకులు పరుగులు తీయడం వల్ల వాటి ధర ఒక్కసారిగా పెంచేశారు. రూ. 6 ఉంటే రూ. 80కి విక్రయించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు నాలుగు రోజులు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మందుల దుకాణాలపై దాడులు చేశారు. ఎక్కువ ధరకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. వైద్యులు మందుల చీటీలో రాస్తేనే ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో సామాన్యుడు మెడికల్ దుకాణాలకు వెళ్తే స్టాక్ లేదని చెప్పేస్తున్నారు.
యజమానులు ఏమంటున్నారంటే?
మాస్కులు తయారు చేసే వారే రూ. 20 తక్కువకు ఇవ్వడం లేదని, వాటిని కొనుగోలు చేసి తాము రూ. 10కి ఎలా విక్రయిస్తామని దుకాణాల యజమానులు వాపోతున్నారు. జిల్లా అధికారులు పరిశీలించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
దారి మళ్లింపు
ఔషధ నియంత్రణ అధికారులు వరుస దాడులు చేయడం వల్ల మాస్కులను దారిమళ్లించారు. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలు, పాఠశాలలకు కొందరు గుట్టుగా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. జలుబు, దగ్గు ఉన్న వారికి సైతం మాస్క్లు దొరికే పరిస్థితి లేదు.
శాఖల మధ్య సమన్వయంతో...
శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి చేయిదాటక ముందే ఔషధ నియంత్రణ శాఖ అధికారులే కాకుండా విద్య, తూనికలు కొలతల శాఖ, వైద్యఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ అధికారులు, జిల్లా అధికారులు ఏకకాలంలో స్పందించి మాస్క్లు, శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకునే ఇతర రసాయనాల అక్రమ నిల్వలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.