telangana university registrar: తెలంగాణ విశ్వవిద్యాలయంలో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి స్థానంలో ఆచార్య శివశంకర్ తాత్కాలిక రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఉపకులపతి రవీందర్‌గుప్తా ఆదేశాలు జారీ చేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం అందరినీ విస్మయానికి గురి చేసింది. గతంలో రిజిస్ట్రార్‌గా నసీం కొనసాగగా.... ఆమె స్థానంలో ఆచార్య కనకయ్యను సెప్టెంబర్ 1న నియమించారు. మరోసారి అక్టోబర్ 30న జరిగిన పాలకమండలి సమావేశంలో కనకయ్య నియామక ఉత్తర్వులను రద్దు చేసి... కొత్త ఇంఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య యాదగరిని తీసుకొచ్చారు. కానీ సరిగ్గా 40 రోజులకే ఇప్పుడు శివశంకర్‌కు ఇంఛార్జ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేవలం మూడున్నర నెలల్లోనే ముగ్గురు రిజిస్ట్రార్‌లు మారి... నాలుగో వ్యక్తి బాధ్యతలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
telangana university Nizamabad : 2014లో నియామకమైన ఉద్యోగులు తమ సమస్యను చెప్పుకునేందుకు గురువారం వీసీ వద్దకు వెళ్లారు. వీరి సమస్య పరిష్కరించే విషయంలో రిజిస్ట్రార్ యాదగిరి, వీసీ రవీందర్‌గుప్తా మధ్య సమన్వయం కుదరలేదు. దీంతో వెంటనే రిజిస్ట్రార్‌ను వీసీ మార్చేశారు. అంతకుముందు నసీంకు సైతం ఇదే విధంగా జరిగింది. తాను చెప్పినట్లుగా సంతకాలు పెట్టడం లేదని అప్పటికప్పుడు ఆచార్య కనకయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరోసారి యాదరిగి విషయంలోనూ అలాగే జరిగింది. వీసీ రవిందర్ గుప్తా నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇప్పటివరకు రిజిస్ట్రార్‌గా ఉన్న యాదగిరిని నేరుగా ప్రభుత్వ పెద్దలే ప్రతిపాదించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన ఇమడలేకపోవడం, అంతర్గత రాజకీయాలకు తోడు సమస్యలు తెచ్చి పెట్టే పనులు చేయాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇదే సమయంలో వీసీ సైతం యాదగిరి మీద అసంతృప్తితో శివశంకర్‌ను తీసుకొచ్చారు. గతంలోనూ శివశంకర్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు.