కుక్కకి నెల మాసికం చేసిన యజమాని - sanjeev
తన భార్య మరణం కూడా అతన్ని అంతగా బాధించలేదు. కానీ ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క మరణం కలిచి వేసింది. గతనెల 17న మరణించిన టిక్కుకి ఈ రోజు నెల మాసికం నిర్వహించాడు.
నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలో రిటైర్ డీపీవో గద్దల సంజీవ్ 14ఏళ్ల క్రితం 'టిక్కు' అనే శునకాన్ని తెచ్చుకుని పెంచుకున్నాడు. గత ఏప్రియల్ 17న టిక్కు అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి యజమాని దాని జ్ఞాపకాలతోనే గడుపుతున్నాడు. ఈరోజు నెల మాసికం కూడా జరిపించాడు. బంధు మిత్రులందరిని ఆహ్వానించాడు.
సంజీవ్‌కు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలు అమెరికాలో, కొడుకు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. మూడేళ్ల క్రితం భార్య మరణించింది. సంజీవ్‌కు తోడుగా టిక్కు మాత్రమే ఉంది. తన భార్య చనిపోయినప్పుడు కూడా ఇంతలా బాధపడలేదని సంజీవ్ చెబుతున్నాడు.
ఒంటరిగా ఉన్న తనకు టిక్కు తోడుగా ఉందని..ఇప్పుడు అది కూడా చనిపోవటం వల్ల మళ్లీ ఒంటరయ్యానని వాపోయాడు.