Attack on MP Arvind: నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. నందిపేట్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఇస్సాపల్లి వద్ద ఎంపీ అర్వింద్ కారుపై దాడి జరిగింది. అధిక సంఖ్యలో ఎంపీ అర్వింద్ వాహనంతోపాటు ఇతర వాహనాలపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ దాడిలో ఎంపీ అర్వింద్ కారుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
కత్తితో దాడి
ఆరుగురు కార్యకర్తల చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. పలువురికి చేతులు విరిగిపోయాయి. ఓ భాజపా కార్యకర్తపై ఓ వ్యక్తి దాడి చేస్తుండగా అతను పరిగెత్తాడు. అయినా వదలకుండా వెంబడించి మరి కొట్టాడు. కింద పడిన ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అక్కడికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని నిలువరించారు. అయినా ఆ వ్యక్తి కాళ్లతో తన్నాడు. రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డారని... తెరాస కార్యకర్తలతో పోలీసులే దాడి చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఇనుప గుండ్ల లాంటి వాటితో తమ కార్యకర్తలను కొట్టారని మండిపడ్డారు.