నిజామాబాద్ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్ రోగుల మృతి ఘటనకు మరో వివాదం తోడైంది. కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాల తరలింపులో కొవిడ్ నిబంధనలు గాలికొదిలేశారు. ప్రభుత్వ అంబులెన్సులో తరలించి ఖననం చేయాల్సిన చోట.. ఆటో, ప్రైవేటు అంబులెన్స్‌ల్లో తరలించారు. వీటి ఖర్చులు బాధిత కుటుంబాలే భరించాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ఆటోలో మృతదేహం తరలింపు చిత్రం శనివారం స్థానిక‘ఈనాడు’లో ప్రచురితమైంది. ఈ చిత్రంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. సర్కారు తీవ్రంగా పరిగణించింది.
బాధ్యులపై చర్యలు
బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి శనివారం ఆదేశించారు. సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లందరూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ సాయంత్రానికల్లా మధ్యంతర నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం మార్చురీ సిబ్బందికి తాఖీదులిచ్చారు.
మరో వివాదం
నిజామాబాద్ సర్వజన ఆసుపత్రిలో గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటేలోపు ముగ్గురు కరోనా, ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. ఆక్సిజన్ అందక చనిపోయారంటూ మృతుల కుటుంబీకులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కరోనాతో చనిపోయిన మృతదేహాల తరలింపులో కొవిడ్ ప్రొటోకాల్ పాటించలేదనే మరో వివాదం తెరపైకి వచ్చింది. మృతదేహాల తరలింపునకు మృతుల బంధువులతో పాటు పోలీసులు శుక్రవారం గంటల తరబడి వేచి చేశారు. చివరకు అంబులెన్సు కోసం పోలీసులు ఆసుపత్రి అధికారులను సంప్రదించగా వారు ఇన్‌ఛార్జి నంబరు ఇచ్చారు. ‘కొవిడ్ ప్రొటోకాల్‌లో ఒక్కటే అంబులెన్సు ఉంది. డ్రైవర్ విధులకు రాలేదు. నేనేమీ చేయలేను’ అని సదరు ఇన్‌ఛార్జి చేతులెత్తేశారు.