తెలంగాణ

telangana

By

Published : Jan 9, 2022, 4:59 PM IST

ETV Bharat / state

నెల రోజులైనా మొలకెత్తని పొద్దుతిరుగుడు.. నిండా మునిగిన అన్నదాతలు

Sun Flower Seeds fraud in Nizamabad: ప్రభుత్వ ప్రణాళిక లోపమో? విత్తన కంపెనీల ధనదాహమో? కర్షకుల పాలిట శాపమైంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని ప్రకటించడంతో ప్రత్యామ్నాయ పంటలకు సిద్ధమైన.. ఔత్సాహిక రైతులకు ఆదిలోనే హంసపాదులా నకిలీ విత్తనాలు నడ్డి విరిచాయి. నిజామాబాద్‌ జిల్లాలో 700 ఎకరాల్లో నష్టపోయిన అన్నదాతల దీనస్థితిపై కథనం.

Sun Flower Seeds fraud in Nizamabad:
నకిలీ విత్తనాలు కంపెనీ సంచిని చూపిస్తున్న రైతు

నిజామాబాద్​లో నకిలీ విత్తనాల దందా

Sun Flower Seeds fraud in Nizamabad: యాసంగిలో వరిధాన్యం కొనబోమని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేయడంతో అనేకమంది రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లారు. నిజామాబాద్ జిల్లాలో అనేకమంది కర్షకులు పొద్దుతిరుగుడు వైపు మొగ్గుచూపారు. ప్రభుత్వం దగ్గర ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో విత్తన కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా అక్రమార్కులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టారు. రూ.12వందలకు దొరికే విత్తన సంచులను రూ.2,500కు అమ్మినా అన్నదాతలు కొనుగోలు చేశారు. సిరికొండ, భీమ్‌గల్‌ మండలాల పరిధిలో దాదాపు 700 ఎకరాల్లో పొద్దుతిరుగుడు విత్తనాలు విత్తారు. మంచి దిగుబడితో లాభాల బాట వస్తాయన్న రైతులు ఆశలు ఆవిరయ్యాయి. నెలగడిచినా విత్తనాలు మొలకెత్తకపోవడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు.

Nizamabad farmers seeds fraud: సర్కారు చెప్పిందని ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపితే నిండా మునగాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల పొద్దుతిరుగుడు విత్తనాలను దున్నేసి మళ్లీ వరి వేస్తున్నారు. సర్కారే తమను ఆదుకోవాలని గోడు వెళ్లబోసుకుంటున్నారు. నకిలీ విత్తనాలతో చాలా మండలాల్లో అపారనష్టం వాటిల్లిందని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వ ప్రణాళిక లోపమే కారణమని మండిపడుతున్నారు.

మూడెకరాల పొద్దు తిరుగుడు పంట వెేసినా ఒక్కటి కూడా మొలకెత్తలేదు. వరి వేసుంటే ఇంత ఖర్చు కాకుండా ఉండే. ఒక్కో బస్తాకు రూ.2500 ఇచ్చి విత్తనాలు తీసుకొచ్చాం. మొత్తం నష్టపోయినాం. మా పైసలు ఇవ్వమంటే ఇస్తలేరు. - భూక్య శంకర్, పిప్రి తాండ, భీమ్​గల్ మండలం

మొత్తం 12 బస్తాలు తెచ్చి పొద్దు తిరుగుడు సాగు చేసినా. అక్కడొకటి అక్కడొకటి మాత్రమే మొలిచింది. ఇదీ ఎట్లా అని అడిగితే నష్ట పరిహారం కింద ఏమైనా చేస్తామంటున్నారు. కానీ మాకు డబ్బులు ఇచ్చినా కూడా అంతా నష్టమే. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. - మాలవత్ రంగయ్య, న్యావనంది తండా, సిరికొండ మండలం

అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తమను కష్టాల పాలు చేశారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. నర్సింగ్‌పల్లిలో ఓ వ్యాపారి విక్రయించిన సుమారు 200 బస్తాల పొద్దుతిరుగుడు విత్తనాలు మొలకలు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

పొలంలో అన్ని రకాల మందులు వాడినాం. ఎక్కడా కూడా విత్తనాలు మొలవనే లేదు. నకిలీ విత్తనాల వల్లే ఇలా జరిగింది. ప్రభుత్వం మాకు తగిన సాయం చేయాలే. - మహిళా రైతు, నిజామాబాద్ జిల్లా

మూడెకరాల్లో పూవులు నాటినాం. అన్ని రకాల సేద్యం చేసినాం. ఎక్కడా కూడా మొలక రాలే. ఇక చేసేదేం లేక మళ్లీ వరి పంట వేసుకుంటున్నాం. నర్సింగ్​పల్లిలో ఒక్కో బస్తా రూ.2500 పెట్టి విత్తనాలు తెచ్చినం. వాళ్లను పైసలు అడిగితే కంపెనీపై కేసు పెట్టినాం అని చెబుతున్నారు. అధికారుల నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు.- నరేష్, బాధితుడు, రావుట్ల గ్రామం, నిజామాబాద్ జిల్లా

ఇప్పటికైనా ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించాలని రైతులు కోరుతున్నారు. నకిలీ విత్తనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details