బోరుమోటర్ మరమ్మత్తుల కోసం విద్యుత్ లైన్ బ్రేకర్‌ను ఆఫ్ చేయబోయి... విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మేగ్యా నాయక్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన దేగావత్ కిషన్ నారుమడికి నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. బోరు మోటర్ పనిచేయకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి సరి చేద్దామని భావించాడు. ఏబీ స్విచ్ (బ్రేకర్) ఆఫ్ చేసేందుకు యత్నించగా.. దానికి విద్యుత్ సరఫరా జరిగే అక్కడికక్కడే మృతి చెందాడు.
గతంలోనూ ఇదే చోట ప్రమాదం..
దీనికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని తండావాసులు ఆరోపించారు. ఇదే స్తంభంపై పదేళ్ల క్రితం లైన్ మెన్ మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. స్తంభం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ మార్చలేదని, అందువల్లే ప్రమాదం జరిగింది ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మృతికి విద్యుత్ శాఖ అధికారుల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.