Nizamabad Family Suicide Case: నాలుగురోజుల క్రితం విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేశ్ కుటుంబం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. సురేశ్ రాసిన మరణ వాంగ్మూలం, సెల్ఫీ వీడియో ఆధారంగా నిర్మల్‌కు చెందిన వినీత, చంద్రశేఖర్, నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్‌లపై 306సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిజామాబాద్‌కు వచ్చిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్-2లోని శ్రీచైతన్య అపార్ట్మెంట్‌లో సురేశ్ కుటుంబం నివాసముండే 207 నంబర్ గల ఇంటిని పరిశీలించారు. అక్కడున్న ఆపార్ట్మెంట్ సిబ్బందిని, అందులో నివాసముండే వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అప్పులు చెల్లించాలంటూ సురేశ్ ఇంటికి వచ్చిన అందరినీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారిస్తామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
అరెస్ట్ చేసే అవకాశం...
ప్రాథమిక విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సురేశ్ ఇంటికి వచ్చి అప్పుల కోసం వేధించిన వారి జాబితాను సిద్ధం చేసి విచారించనున్నారు. అలాగే సెల్ఫీ వీడియోలో చెప్పిన వ్యక్తులను విచారిస్తారు. సురేశ్ కుటుంబం నిర్వహించే వ్యాపార ప్రాంతాల్లోనూ విచారణ చేయనున్నారు. వ్యాపార భాగస్వాములు, కుటుంబీకులు, బంధువులను అడిగి వివరాలు తెలుసుకున్న తర్వాత నిందితులను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. సెల్ఫీ వీడియోలో పేర్లు చెప్పినప్పటికీ అది నిజమని నిర్ధరణ అయిన తర్వాతనే తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.