damaged roads: నిజామాబాద్‌లో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్లేసి ఎంతో కాలం కాకున్నా గుంతలు తేలి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో దాదాపు నాలుగు లక్షల జనాభా నివసిస్తోంది. నగరంలో ప్రధాన, అంతర్గత రహదారులపై నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. హైదరాబాద్ రోడ్డు, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ ప్రధాన రోడ్లతో పాటు వివిధ డివిజన్లల్లోని అంతర్గత రహదారులన్న రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. నగర పాలక సంస్థకు ప్రత్యేక నిధులతో రెండేళ్లుగా రోడ్లు వేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో వాటి స్వరూపమే మారిపోతోందని వాహనదారులు వాపోతున్నారు.
ప్రమాదకరంగా మారిన గుంతల్లో వాహనాలు నడపడానికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని సమయాల్లో వాటిలో పడి ప్రమాదాల బారిన సైతం పడుతున్నారు. నిత్యం విద్య, వైద్య తదితర అవసరాల కోసం ప్రయాణించే వారి బాధలు వర్ణణాతీతం. దెబ్బతిన్న రోడ్లపై వెళ్తున్న వాహనాలు సైతం మొరాయించడం వల్ల అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరకం చూపిస్తున్న రోడ్లను యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని ఇందూరువాసులు కోరుతున్నారు.