basti hospitals in Nizamabad: హైదరాబాద్‌లో విజయవంతమైన బస్తీ దవాఖానాలను రాష్ట్రమంతటికీ విస్తరించారు. ప్రాథమిక వైద్యం కోసం పెద్దాసుపత్రులకు వెళ్లే అవసరం లేకుండా సమీప కాలనీల్లోనే ఉండేలా ఈ దవాఖానాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాకు మొత్తం 5 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం మంజూరు చేసింది. నిజామాబాద్ నగరంలో మూడు, ఆర్మూర్, బోధన్‌లకు ఒక్కో ఆస్పత్రిని కేటాయించారు. గత ఏడాది ఆగస్టులో నిజామాబాద్‌లోని నాగారం, ఖానాపూర్ ప్రాంతంలో బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. కానీ కనీస మందులు కూడా అందుబాటులో ఉండకపోవడం, వైద్యులు లేకపోవడంపై రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దవాఖానాల్లో రక్త పరీక్షలు నిర్వహించట్లేదు: నాగారం బస్తీ దవాఖానాలో అన్ని రకాల రోగులకు ఒక్కరే వైద్యులు ఉండటంతో అక్కడికి వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, షుగర్, జ్వరం వంటి రోగాలకు మందులు ఇవ్వడానికి మాత్రమే ఈ దవాఖానా ఉపయోగపడుతోంది. రక్త నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో రోగులు వస్తున్నా.. మాత్రలు మాత్రమే ఇచ్చి పంపుతున్నారు. ఇక ఖానాపూర్ బస్తీ దవాఖానాలో గత డిసెంబర్ నుంచి వైద్యుడు రావడం లేదు. దీంతో అప్పటి నుంచి స్టాఫ్ నర్సు, ఇతర సిబ్బందితోనే ఈ ఆస్పత్రి నడుస్తోంది.
వైద్యుడు లేక నిర్ధారణ పరీక్షలు చేయట్లేదు:సాధారణ రోగులతో పాటు గర్భిణీలు సైతం ఆస్పత్రికి వస్తున్నారు. అయితే వైద్యుడు అందుబాటులో లేక వారికి పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. నిజామాబాద్ నగరంలోని మరొక బస్తీ దవాఖానా నిర్మాణ దశలో ఉండటంతో ఇంకా ప్రారంభం కాలేదు. బోధన్‌లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలో వైద్యులు సరిగ్గా అందుబాటులో ఉండటం లేదు. వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేపట్టడం లేదు. ఆర్మూర్‌లోని మామిడిపల్లి పాత పంచాయతీ భవనంలో ఏర్పాట్లు పూర్తి చేసినా ఇంకా ఆసుపత్రిని ప్రారంభించలేదు.