చుట్టూ ఎత్తైన కొండలు.. పచ్చని చీర కట్టుకున్న ప్రకృతి అందాలు.. ఒంపులు తిరిగిన రహదారి మలుపులు.. నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ వద్ద కనిపిస్తున్న ఈ దృశ్యాలు అందరి మదినీ దోచుకుంటున్నాయి. అక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఆదిలాబాద్ వెళ్లే మార్గంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం రాణాపూర్ దాటగానే.. మహబూబ్ ఘాట్ మొదలవుతుంది. కొండల మధ్య దాదాపు 4 కిలో మీటర్లు వంకర్లు తిరుగుతూ కనిపిస్తుంది. రహదారి మార్గమంతా పొగమంచు అలముకోవడంతో ఊటీని తలపిస్తోంది. మహారాష్ట్రలోని విదర్భ సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అక్కడి పర్వత ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.