నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేళ్తారోడ గ్రామ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలూ సంచరిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనతో ఉలిక్కిపడిన ప్రజలు... సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఫోన్ తీయకపోవడం వల్ల భైంసా అధికారికి విషయాన్ని తెలిపినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకోని ఉన్న బేళ్తారోడా గ్రామ శివారులోని పత్తి చెనుకు కాపలాగా కట్టి ఉన్న రెండు కుక్కలను చిరుత చంపి తిన్నట్లు రైతులు ప్రథమికంగా తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించారు...
సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుతపులి సహా రెండు పిల్లలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. చేనుకు కాపలాగా ఉన్న రెండు కుక్కలను చంపి తింటున్నపుడు చూసిన కొందరు గ్రామస్థులు... భయాందోళనకు గురై ఊర్లోకి పరుగులు తీసినట్లు పేర్కొన్నారు. కుక్కలను చిరుత చంపినట్లుగా నిర్ఖారిస్తూ అటవీ శాఖ అధికారులు వాటి పంజా ముద్రలను గుర్తించారు. అనంతరం కొద్దిసేపటికే ఈ విషయంపై తానూర్ మండలానికి సంబంధించిన అటవీ అధికారి రాగా... పాత్రికేయులు ఆయన్ను వివరణ కోరారు. ఘటనా స్థలాన్ని చూసే వరకు ఏమి చెప్పలేనని దురుసుగా బదులిచ్చినట్లు సమాచారం.