ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో జరిగిన పలు అవకతవకలపై దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు స్పందించారు. ఏఈఓ శ్రీనివాస్‌ను మరోసారి సస్పెండ్ చేశారు. అతనితోపాటు మరో ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్‌కు దేవాదాయ శాఖ అధికారులు చార్జీమెమోలు జారీ చేశారు.
గతంలో ఆలయ విగ్రహాల తరలింపు కేసులో ఏఈఓ శ్రీనివాస్ హస్తముందంటూ ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై మే నెలలో ఆర్జేడీ కృష్ణవేణి ఇచ్చిన నివేదికల ప్రకారం దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తప్పులు చేసిన పలువురు ఉద్యోగులపై కొరడా ఝులిపించారు. ఆలయ ఏఈఓ శ్రీనివాస్‌ను జూన్ 18న సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ నిలుపుదలపై శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుకూల ఉత్తర్వులు పొందారు. గత సోమవారం తిరిగి విధుల్లో చేరాడు.