తెలంగాణ

telangana

ETV Bharat / state

Basra IIIT Students: చదువుల పూదోటలో గుబాళించిన గ్రామీణం

ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతున్న బాసర విద్యార్థులు సత్తా (Basra IIIT Students) చాటుతున్నారు. వారం రోజుల్లో వివిధ సంస్థలకు 127 మంది ఎంపికయ్యారు. గరిష్ఠంగా రూ.9 లక్షలు, కనిష్ఠంగా రూ.4 లక్షల వార్షిక వేతనాలతో ఉద్యోగాలు సాధించారు.

Basra IIIT Students
Basra IIIT Students

By

Published : Oct 11, 2021, 8:31 AM IST

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు(Basra IIIT Students) ప్రతి ఏడాది మాదిరే ఈ సంవత్సరం ప్రాంగణ నియామాకాల్లో సత్తా చాటుతున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు, నిరుపేద నేపథ్యం కలిగిన విద్యార్థులు సాధించిన ఈ విజయాలు మిగతా విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఇక్కడ ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పలు సంస్థలు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో గత గురువారం 27 మంది, శుక్రవారం వందమంది విద్యార్థులు గరిష్ఠంగా రూ.9 లక్షలు, కనిష్ఠంగా రూ.4 లక్షల వార్షిక వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగాలు కొల్లగొట్టిన విద్యార్థుల నేపథ్యం పరిశీలిస్తే..

ఎక్కడినుంచో వచ్చి.. ఉద్యోగాన్ని చేపట్టి

ఛత్తీస్‌గఢ్‌ జిల్లా రాయ్‌పుర్‌కు చెందిన ఆయుష్‌వర్మ విద్యాలయంలో 2016లో చేరాడు. తండ్రి భద్రతాదళాల్లో పనిచేయటంతో ఉద్యోగ బదిలీపై రాజధానికి వచ్చి అక్కడి పాఠశాలలో చదివి బాసర విద్యాలయానికి ఎంపికయ్యాడు. ఆయుష్‌ వాసర్‌ ల్యాబ్స్‌ కంపెనీలో రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందాడు.

స్పోర్ట్స్‌ కోటాలో సీటు.. ప్రతిభతో ఉద్యోగం

మెదక్‌ జిల్లా వెల్దుర్తికి చెందిన శ్రావ్యది వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్నలిద్దరూ సాగుచేస్తారు. తూప్రాన్‌లో ఓ పాఠశాలలో చదివిన శ్రావ్య పదోతరగతిలో 8.3 జీపీఏ సాధించింది. ఫెన్సింగ్‌ ఆటలో ప్రావీణ్యం ఉండటంతో స్పోర్ట్స్‌ కోటాలో సీఎస్‌ఈ విభాగంలో సీటు సంపాదించింది. రూ.8.8 లక్షల వార్షిక వేతనానికి థాట్‌వర్క్స్‌ అనే కంపెనీలో ఉద్యోగం సాధించింది.

సాఫ్ట్‌వేర్‌ కొలువులో రైతుబిడ్డ

పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన లవణ్‌కుమార్‌ పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. నాన్న రాజగట్టు వ్యవసాయం చేస్తుండగా అమ్మ మల్లీశ్వరి గృహిణి. లవణ్‌ గత వాసర్‌ ల్యాబ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామాకాల్లో రూ.9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించాడు.

భవిష్యత్తును చెక్కుకున్న వడ్రంగి బిడ్డ

రంగారెడ్డి జిల్లాకు చెందిన శివానిది నిరుపేద నేపథ్యమే. తండ్రి వడ్రంగిగా పనిచేస్తుండగా తల్లి ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరిచిన శివాని పదవ తరగతిలో పది జీపీఏ సాధించింది. థాట్‌వర్క్స్‌ కంపెనీలో రూ.8.8 లక్షల వార్షిక వేతనంతో కొలువు సాధించింది.

ఇదీ చూడండి: RGUKT: పేరుకుపోతున్న నిర్వహణ బకాయిలు.. ఉద్యోగుల వేతనాలకూ తప్పని తిప్పలు

ABOUT THE AUTHOR

...view details