నారాయణపేట మార్కెట్‌లో తొలుత క్వింటాలుకు రూ.7 వేలకు పైగా కందుల ధర పలికింది. తర్వాత క్వింటాకు రూ.6600 ఉన్న ధర మంగళవారం ఏకంగా 5 వేలకు పడిపోయింది. క్వింటాకు రూ.1,600 వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే దిగుబడి తగ్గి నష్టపోతుంటే.. మరోవైపు మార్కెట్‌లో ధరకుడా తగ్గడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు ఎలా తీర్చాలో అంతు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొంటే మేలు జరుగుతుందని రైతులు కోరుతున్నారు.
కర్ణాటకలో అమ్మకం
నారాయణపేట మార్కెట్‌లో ఒక్కసారిగా మంగళవారం క్వింటాకు రూ.1600 నుంచి రూ.వెయ్యి నష్టం రావడంతో కొంతమంది రైతులు కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్‌కు తీసుకెళ్లి కందులు విక్రయిస్తున్నారు. అక్కడ రూ.5,500 నుంచి రూ.6,000 వరకు క్వింటాలుకు విక్రయిస్తున్నారు. అక్కడా తూకంలో మోసంతో నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. విధిలేని పరిస్థితిలో ఇలా విక్రయించి నష్టపోతున్నామంటున్నారు. అసలే దిగుబడి తగ్గి గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెట్టుబడి నెత్తిన పడింది
కౌలుకు 12 ఎకరాలను రూ.60 వేలకు తీసుకుని కంది సాగు చేశా. వర్షానికి పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. విత్తిన నాటి నుంచి పంట చేతికి వచ్చే దాకా రూ.1.80 లక్షల పెట్టబడి పెట్టా. 18 క్వింటాళ్ల కందులు చేతికొచ్చాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. బయట విక్రయిస్తే మరింత నష్టపోవాల్సి వస్తుంది. - అద్దన్ వెంకట్‌రెడ్డి, రైతు, దామరగిద్ద.