రైతుబంధు పథకంలో పట్టా ఉన్న రైతులకే పెట్టుబడి అంటున్న రాష్ట్ర ప్రభుత్వం అదే పొలాన్ని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతుకు మాత్రం మొండిచెయ్యి చూపించింది. ఈ విధానం వల్ల పట్టా ఉన్న రైతులు స్వయంగా సాగు చేయకపోయినా వారికి ఇటు పెట్టుబడి సొమ్ము, అటు కౌలు రెండూ చేతికి అందుతున్నాయి. కౌలు రైతులకు మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. కౌలురైతు సాగుచేసిన పంట నష్టపోతే కనీసం బీమాతోనైనా ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఉద్దేశం మంచిదే అయినా.. నిబంధనల మేరకు అమలు చేయాలంటే క్షేత్రస్థాయిలో కష్టమేనని చెప్పాలి. కిందటి ఏడాది వరకు కౌలు రైతుకు కనీసం పంటల బీమాకు అవకాశం కూడా లేకపోగా.. ఈ ఏడాది బీమా గడువు ముగిసేలోపు వ్యవసాయశాఖ ఈ అవకాశం కల్పించనుంది. మూడు రోజుల క్రితం రాష్ట్ర రాజధానిలో జరిగిన వ్యవసాయశాఖ సమీక్షలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవసాయశాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కౌలు రైతులు ఎక్కువగా గద్వాల జిల్లాలోనే ఉన్నారు. వీరిలో చాలామంది విత్తనపత్తి సాగు కోసం భూములు కౌలుకు తీసుకున్నారు. బీమా నిబంధనల మేరకు విత్తనపత్తి సాగు రైతులకు ఈ సౌకర్యం వర్తించదు. సాధారణ పత్తి, మొక్కజొన్న, మిరప తదితర పంటలు సాగు చేసిన కౌలు రైతులకు బీమా పథకం వర్తిస్తుంది.
నిబంధనలే ఆటంకం