తోడల్లుడు మోసపూరితంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని... ఓ రైతు పురుగుమందు సీసా వెంటబెట్టుకుని మరీ టవరెక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలోని కోస్గి పురపాలిక పరిధి సంపల్లిలో జరిగింది. సంపల్లికి చెందిన కృష్ణారెడ్డి, బిచ్చమ్మ దంపతుల పెద్ద కుమార్తె ప్రమీలను కోస్గి మండలంలోని అమ్లికుంట్లకు చెందిన కొత్తూరు నారాయణరెడ్డికి ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. ఇంటికి పెద్దల్లుడు కావడం వల్ల నారాయణరెడ్డి అమ్మికుంట్లలోని తనకున్న మూడెకరాల భూమిని అమ్మి మిగిలిన ముగ్గురు మరదళ్ల పెళ్లిళ్లు చేశారు.
మిగిలి ఉన్న 12 ఎకరాల్లో నారాయణరెడ్డికి నాలుగెకరాల భూమిని మామ కృష్ణారెడ్డి రాసిచ్చారు. కృష్ణారెడ్డి చనిపోయాక నాలుగో కుమార్తె రాధాదేవి భర్త మర్రి కృష్ణారెడ్డి అత్త బిచ్చమ్మకు మాయమాటలు చెప్పి 8 ఎకరాల్లో విడతల వారీగా అయిదెకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మిగిలిన మూడెకరాల భూమి మామ కృష్ణారెడ్డి కాస్తులో ఉంది. ఇటీవల దాన్ని సైతం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నాడని, అధికారులు డబ్బులు తీసుకొని సహకరిస్తున్నారని నారాయణరెడ్డి, ఆయన భార్య ప్రమీల ఆరోపించారు.