వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పేదలు ధనికులుగా మారితే... కేసీఆర్ పాలనలో రాష్ట్రమే దివాలా తీసిందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నాలుగు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించిన ఆమె.. బాధ్యతలను గుర్తుచేస్తే వ్యక్తిగత దాడికి దిగుతున్నారంటూ ఆరోపించారు. నిరుద్యోగులకు బాసటగా.. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ షర్మిల నిరాహారదీక్ష చేశారు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అంతకుముందు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. షర్మిల దీక్షకు పూర్తి మద్దతు పలికారు. నిరుద్యోగుల పక్షాన పోరాడటాన్ని కోమటిరెడ్డి స్వాగతించారు.
'ఏ వర్గాన్ని కదిలించినా అమ్మ అప్పులపాలైపోయామంటున్నారు. బిడ్డ పెళ్లిచేయాలంటే అప్పు.. రైతుకు పెట్టుబడి కావాలంటే అప్పు.. ప్రతి కుటుంబమూ అప్పులపాలైపోయింది తెలంగాణలో. కేసీఆర్ కుటుంబం మాత్రమే అప్పులపాలు కాలేదు. ఈ రోజు నాలుగు లక్షల కోట్లు మన రాష్ట్రానికి అప్పులున్నాయి. ఎందుకు తీసుకున్నారు.. కేసీఆర్ సారు. ఒకరికన్నా ఉద్యోగమిచ్చారా.. ఒకరికన్నా ఇల్లు కట్టారా.. రుణమాఫీ చేశారా.. ఎవరి జేబుల్లోకి వెళ్లిందీ ఈ డబ్బంతా.. ఉద్యోగమివ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు.. ఎవరికైనా వచ్చిందా..'